Monday, February 27, 2017

నా జ్ఞాపకాలు.


                                              అనామకుని ఆత్మకథ         
                                          బాలగంగాధర రావు మండవ    
                                   నాకు బాగా జ్ఞాపకం వున్నది 1949 నుండి అనుకుంటాను. నాకు ఉహ తెలిసేనాటికి  మా కుటుంబం  రేపల్లె లో ఉన్నది. నేను చాలాకాలం మా స్వంత ఊరు రేపల్లె అనుకునేవాణ్ణి. కాని తర్వాత తెలిసింది, మా స్వంత ఊరు గొరికపూడి అని. నా బాల్యం అంతా రేపల్లె లోనే గడిచింది.  1942 లో నా తల్లితండ్రుల వివాహం జరిగితే ,నేను 1943 లో జన్మించాను.నా మాతామహుల వూరు దుగ్గిరాల దగ్గిర మంచికలపూడి.నేను అక్కడే జన్మించాను. మా అమ్మమ్మ, మా తండ్రి గారికి మేనత్త అవుతుంది. నాకు వుహ తెలిసేనాటికి నా మాతామహులు కూడా రేపల్లె లోనే స్థిర  నివాసం  ఏర్పరుచుకున్నారు.
                    నేను పుట్టింది 1943  డిసెంబర్ 2 అయితే మా తాతయ్య నన్నుహై స్కూల్లో చేర్చేటప్పుడు వయసు చాలలేదని ఒక సంవత్సరం ఎక్కువ వేసారు. ఆ రకంగా నా పుట్టిన తేది డిసెంబర్,2,  1942 అయ్యింది.
నా ప్రాధమిక విద్య ఆంతా ప్రైవేటు  ఉపాధ్యాయుల వద్దే జరిగింది. మా ఇళ్ళ వద్దే ఎవరో ఒకరింట్లో ఈ బడి జరిగేది..నాకు ఆక్షరాభ్యాసం చేసిన పంతులుగారు నేను విజయవాడ లో బిఎస్సీ చదవుతున్నప్పుడు కూడా మాఇంటికి విజయవాడ వచ్చేవారు. ఆయన తరువాత, 5 వ తరగతి వరకునాగేంద్రంగారని ఒక మాస్టర గారి దగ్గర చదువుకున్నాను. నా ప్రాధమిక విద్య స్థాయి లో  నాకు మంచి పునాది పడలేదని నాకు ఒక అభిప్రాయం వున్నది. నేను చదివిన ప్రైవేటు పంతులుగార్లకు  చదువు చెప్పే సామర్ధ్యం ఉన్నదని నేను అనుకోను.  వాళ్ళెవరు యసేఎస్యల్సి కూడా పాస్ అయినవాళ్ళుకాదు. 

ఇసుకపల్లి వెళ్ళే రోడ్డు లో అప్పట్లో మూడు పెద్ద వడ్లమిల్లులు ఉండేవి.రైల్వేస్టేషన్ నుండి ఇసుకపల్లి వెళుతుంటే
కుడివైపున ఉండేవి. అందులో మొదటిదానికి ఎదురుగా ఒక చిన్న చెరువు ,దాని తర్వాత యన్.జి.రంగా బొమ్మా, దాని ప్రక్కగా లోపలికి ఒక దారి వున్నాయి. ఈ దారికి ఎడమవైపున మా తాత గారిల్లు  వుండేది. నాలుగు నిట్టాళ్ళ పూరిల్లు. చుట్టూ మట్టిగోడలు ఉండేవి.
నా బాల్యం అంతా ఈ ఇంట్లోనే గడిచింది.ఆ ఇంట్లో మా తాత, నాయనమ్మ,నా మేనత్తలు ఇద్దరు, మా బాబాయి. నేను వుండేవాళ్ళం. మా పెద్ద మేనత్తకు అప్పటికే వివాహమయ్యింది. మా పెద్ద అమ్మమ్మ కుమారునికే ఇచ్చి చేసారు. అంటే మా తాత గారికి మేనల్లుడే అవుతాడు. మా చిన మేనత్త హైస్కూల్ లో చడువుతూవుండేది.
మా తాతయ్య గారి తండ్రి గారి పేరు గంగయ్య ,తల్లి గారి పేరు రాజమ్మ. అంటే మా ముత్తాత పేరు నాకు పెట్టారన్నమాట కాస్త దేశ భక్తీ కూడా కలిసివస్తుందని కాబోలు నాపేరుని ఆధునీకరించి బాలగంగాధర రావు అని మా తాత గారు పెట్టారు.. అయినా మా భందువులలో కొందరు నన్ను గంగయ్య అనే పిలిచేవారు ..
మా తండ్రిగారి పేరు వెంకట సుబ్బారావు ఆయనా తన మేనత్త కుతురయిన సుశీల వర్ధని ని
పెళ్లి జేసుకున్నారు.అంటే నా కన్నతల్లి పేరు సుశీల వర్ధని అన్న మాట. మా అమ్మ తండ్రి గారి పేరు
కోదండరామయ్య కొండపనేని. మా అమ్మమ్మ పేరు యశోద .. వాళ్లకి ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్దమే పేరు .,అంటే నాకు పెద్దమ్మ పేరు రాజ్యలక్ష్మి అంటే మా అమ్మమ్మ .,వాళ్ళ అమ్మ పేరు పెద్దకుమార్తె కు పెట్టుకున్న దన్నమాట.
మా అమ్మమ్మకి ఒక కొడుకు ,పేరు రంగారావు,అంటే నాకు మేనమామ అన్నమాట.
ఇక మా ముత్తాత గంగయ్యగారికి మాతాత నాగయ్య గారితో బాటు ముగ్గురు కూతుళ్ళు మొదటికూతురు పాపమ్మ ఆమెను గొరికపూడి.. లోనే ఇచ్చారు.వారి ఇంటి పేరు వేములపల్లి
రెండవ కుమార్తె దుర్గమ్మ ఆమెను కూడా గొరికపూడి లోనే ఇచ్చారు.వారి ఇంటి పేరు దేవినేని.
మా తాత గారు నాగయ్యగారు అప్పట్లోనే 8 వరకు చదువుకున్నారు. ఆయనకీ ఇంగ్లీషు రాయడము,చదవడ బాగా వచ్చు.కోర్ట్ వ్యవహారాలలో సలహా కోసరం చాలా మంది ఆయన దగ్గరికి వస్తుండేవారు.మాగ్రామా నికి  బ్రిటిష్ వారి కాలంలో పంచాయతి ప్రెసిడెంట్ గా చేసారుట.మా తండ్రి గారితోపాటు మాతాతగారికి మరొఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు కూడా వున్నారు. మా పెద్ద చిన్నాన్న వెంకట అప్పారావు.,రెండో చిన్నాయన పేరు వేంకటరత్నం. మా మేనత్తలలో పెద్ద మేనత్త పేరు వెంకట నరసమ్మ రెండో మేనత్త పేరు .,రాజ్యలక్ష్మిఅంటే మా తాతగారు చిన్న కూతురికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నారు.
రేపల్లె లో మేము అప్పుడున్న వీధి పేరు ,ఇప్పుడు మండవవారి వీధి గా పిలుస్తున్నారు.మావీదికి ఒకవైపున మాత్రమె వరుసగా ఇళ్ళున్నాయి .రెండోవైపు అంతా  పెద్ద మైదానం. వీధిలో వరుసలో మొదట రాతిగోడల రెల్లుగడ్డి ఇల్లు మా భందువులదే .ఆయన్ని యజ్ఞం అని పిలేచేవారు.రెండో ఇల్లు నాదెళ్ళ సూరయ్యగారు.ఆయన భార్య హనుమాయమ్మ గారు. మూడో ఇల్లు మాది . ఒక రెల్లుగడ్డి ఇల్లు, ఒక చావిడి ఉండేది.తర్వాత ఖాళీ ప్రదేశం .
తర్వాత జగదాంబగారి డాబా ఇల్లు  . వాళ్ళ ఆయన పేరు గుర్తులేదు. వరుసలో చివరి ఇల్లు రాతి గోడలమీద తాటాకు కప్పిన ఇల్లు పుల్లమ్మ గారిది. మా ప్రైవేట్ మాస్టర్ అందులోనే వుండేవారు. ఆయన పేరు నాగేంద్రం గారు.మా ఇళ్ళ ముందు మైదానం లో అవతలి ప్రక్కన పునాదులు వేసిన వేదికమీద ఒక పూరిల్లు .అది కొరటాల సత్యనారాయణ గారిది.ఆయన పెద్ద కమ్యునిస్ట్ నాయకుడు..ఏతా వాత
అప్పట్లో మా వీధిని అందరుకమ్యునిస్టుల బజారు అనేవాళ్ళు.కమ్యునిస్ట్ పార్టీ మీద నిషేధం ఉన్నకాలంలో మలబారు పోలీసులు మా బజారు మీద రెండు సార్లు దాడి చేసారు.ఒక సారి మానాన్నకోసం,ఇంకోసారి కొరటాల గారికోసరం. మానాన్న కూడా రేపల్లె తాలుక కమ్యునిస్ట్ పార్టీ శాఖకి ఒక భాధ్యుడి గా  వున్నారు అప్పట్లో.

మేము ఉండే ప్రాంతమంతా గరపనేల.యెంత వాన కురిసినా బురద కాలికి అంటదు.ఇక వర్షం కురిస్తే మా ఇంటిముందున్న మైదానం ఒక లోతు లేని చెరువు లాగా అయ్యేది.ఇకమాకు ఒకటే ఆటలు.ముఖ్యంగా
కాగితం పడవలు.అందులో ఎన్ని రకాలు కత్తి పడవ, రెక్కలపడవ,మళ్ళీ అందులో ఒక రెక్క వెనక్కి,
ఒకరెక్క ముందుకి.అబ్బో వర్షాకాలం మహా మజాగా ఉండేది.చిన్నతనం నుండి నాకు ఏదన్నా చదవడం,ఆటలాడడంఅంటే మహా ఇష్టం.ముఖ్యంగా ఆటల్లో గోళీలు ,బచ్చాలు,చెడుగుడు,మాది అంతాఇసుకనేల కాబట్టి  చెడుగుడు బాగా ఆడేవాళ్ళం. ఇందులో పాయింట్  రావడమేగాని అవుటయినోడు బయటికి పొయ్యే పని లేదు.తరవాత చావు బతుకులు .అంటేఅవుటయినోడు బయటికి పోవాలి .అంతే ఇప్పటి కబడ్డీ లాగా అన్నమాట .
బచ్చాలంటే నాకు టామ్సాయర్ గుర్తొస్తాడు.సిగరెట్ పెట్టెలు పోగు చెయ్యాలన్న మాట . ఒక్కో పెట్టెకి ఒక్కో విలువ.అన్నింటికంటే ఆ రోజుల్లో గోల్డ్ ఫ్లేక్ పెట్టె విలువ ఎక్కువ. అన్నింటికంటే తక్కువ చార్మినార్.
ఇందులో ఒక గోల్డ్  ఫ్లేక్ పెట్టెకి 10 చార్మినార్ ఓకులు అని మార్పిడి కూడా ఉండేది.

ఒక పెట్టె దొరికితే రెండు ఓకులు దొరికినట్లే. మాఇంటి దగ్గర పెద్దరోడ్డు మీద  బుడే సాయిబు కొట్టు అని  ఒకబడ్డీ కొట్టు వుండేది.నాకోసరం పాపం ఖాళీ సిగరెట్ పెట్టేలన్నీ దాచి  పెట్టేవాడు.మాబుడే సాయిబు కొట్లో గోల్డ్ ఫ్లేక్ దొరికేది కాదు .అవి ఖరీదు సిగరెట్లు.కాబట్టి రైల్ స్టేషన్ అవతల మెయిన్ రోడ్ మీదికి వెళ్ళి వెతకాల్సివచ్చేది.
నేను 6 వ తరగతినుండి,8 వ తరగతి వరకు  బోర్డ్ హైస్కూల్ లో చదువుకున్నాను.అప్పట్లో 6 వాతారగతిని ఫస్ట్ ఫాం అనేవాళ్ళు .తర్వాత సెకండ్ ఫాం ,థర్డ్ ఫాం ,ఫోర్త్ ఫాం, ఫిఫ్త్ ఫాం, చివరిది SSLC. చివరిది కాబట్టి స్కూల్ ఫైనల్ అని కూడా అనేవారు. అంటే 11 వ తరగతి అన్నమాట.అప్పట్లో అదే పెద్ద క్వాలిఫికేషన్ .
1951-52 విద్య సంవత్సరం లో ఫాస్ట్ ఫాం లో చేరాను..అప్పట్లో చివరి పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి పంపేవారు.నేను ఫాస్ట్ ఫాం తప్పాను .అందుకని మరల ఫాస్ట్ ఫాం చదివాను.నేను చదువుకున్నది జిల్లాబోర్డ్ హైస్కూల్ .రేపల్లె లో అది చాలా పెద్దది కొండరాతితో H ఆకారంలో కట్టారు.వెనకాల పెద్ద పెంకుటి చావిడి ఉండేది.

నేను ఫాస్ట్ పం లో ఉన్నాపుడే ప్రత్యెక ఆంద్ర రాష్ట్రం ఉద్యమం తీవ్రంగా జరిగింది.పొట్టి శ్రీరాములు గారు సుమారు 52రోజులు నిరాహార దీక్ష జేసి ప్రాణాలు కోల్పోయారు .ఆంద్ర రాష్ట్రం  తగలబడి  పోయింది. చివరికి కేంద్రం దిగొచ్చి అక్టోబర్ 2 నుండి ఆంద్ర రాష్ట్ర ఏర్పరిచారు. కర్నూలు రాజధాని.హైకోర్ట్ గుంటూరు లో ఏర్పాటు జేశారు. 

1952 లో దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పార్లమెంట్ కి రాష్ట్ర అసెంబ్లీ లకి జరిగాయి.
రేపల్లె నియోజకవర్గం నుండి మా పెదనాన్న అంటే మా నాన్నకు పెద్దమ్మ కుమారుడు మోటూరి హనుమంతరావు గారు పోటీ చేసి గెలిచారు.
ఆంద్ర రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు.1955 లో ఆంద్ర రాష్ట్రం లో శాసనసభకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి .కమ్యునిస్ట్ పార్టీ చిత్తూ చిత్తుగా ఓడిపోయింది.కాంగ్రెస్స్ పార్టీ అధికారం లోకి వచ్చింది బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
రేపల్లె జిల్లా బోర్డ్ హైస్కూల్ లో నేను నాలుగు సంవత్సరాలు అంటే థర్డ్ ఫాం వరకు చదివాను..మా స్కూల్లో 
బోడేపూడి వెంకట్రావు గారు సీనియర్ తెలుగు పండితుడు.మంచి కవి,పండితుడు అని పెద్ద వాళ్ళు చెప్పుకునేవారు.
మా చిన్న మేనత్త అప్పుడు అదే స్కూల్లో చదువుతూండేది.కవిత్వం కూడా రాసేది.ఆమెకి స్కూల్లో సన్మానం చేసి 'కవితాలక్ష్మి 'అని బిరుదు ఇచ్చి ఒక సరస్వతీదేవి బొమ్మ బంగారు పూతపూసింది ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు.ఇదంతా నేను సెకండ్ ఫారం చదివేప్పుడు జరిగింది.స్కూల్లో మా డ్రాయింగ్ మాస్టారు కొత్త కెమెరా కొని  మమ్మల్ని ఫోటో తీసారు.
మా ఇళ్ళ దగ్గరే దోనేపూడి సుబ్బయ్యగారని ఉండేవారు.అయన కొడుకులు ఇద్దరు ఒక్కసారే నాతొ పాటు ఫస్ట్ ఫారం లో చేరారు.పెదదోడి పేరు గంగాధరరావు.చిన్నోడి పేరు నాగేశ్వర రావు .దోనేపుదినుంది వచ్చి అక్కడ ఉంటున్నాడని ,ఆయన్ని దోనేపూడి సుబ్బయ్య గారని పిలిచేవారు.ఆయన ఇంటి పేరు వెనిగళ్ళ.ఆయన ఇంటి కెదురుగా రోడ్ కి ఇవతళ ప్రక్కన NGరంగా గారి బొమ్మ ఉండేది .ఆయనే అది పెట్టించాడు                                                 మా చిన్న మేనత్త పుణ్యమాని నాకు క్లాసు పుస్తకాలకంటే ఇతర పుస్తకాల చదవడం అలవాటయ్యింది.నేను ఆ రోజుల్లోనే విశ్వనాథ వారి వేయిపడగలు పుస్తకం చదివా .కదా గుర్తులేదుకాని కొన్ని పాత్రల పేర్లు గుర్తున్నాయి.ధర్మారావు ,పసికిరి ఇత్యాది.అప్పట్లో శరత్బాబు తెలుగు అనువాదనవాలలు తెగ చదివేవారు ఆంద్ర ఆడపడుచులు.
మాక్లాసులో బెతపుడినుండి  వచ్చ్చేవాళ్ళు ఎక్కువ .పూర్ణ చంద్రరావు గారు మా క్లాబ్ టీచరు.ఆయన కూడా బేతపూడి నుండి వచ్చేవాడు,
మాక్లాసులో ఆడపిల్లలు కూడా ఉండేవాళ్ళు.నాగమణి, సామ్రాజ్యం పేర్లు మాత్రం గుర్తున్నాయి.
 
ఇది నేను ఫాస్ట్ ఫారం లో మా డ్రాయింగ్ మాస్టారు తీసిన ఫోటో.నేను కలర్ లోకి మార్చా .
పైన నిలుచున్నవారిలో కుడినుండి రెండో వాడిని నేనే.

ఇది నేను థర్డ్ ఫారం వరకు చదువుకున్న స్కూల్ .అప్పటికి ఇప్పటికి మార్పు ఏమంటే రంగు వేసారు అంతె
నేను థర్డ్ ఫారం లోకి వచ్చేసరికి మా కుటుంబములో చాలా మార్పులు వచ్చాయి.
మా పెద్ద మేనత్త కాపురానికి వెళ్లి పోయింది .చిన్న మేనత్త బందరు హిందూ కాలేజ్లో డిగ్రీ లో చేరింది.
నేను మా చినమేనట్టా ఇంటర్ చదివేప్పుడు మొదటసారి బెజావాడ వెళ్లాను.మా నాయనమ్మఅక్కమనవాడు అక్కడ పోస్ట్ మాస్టారు .వాళ్ళింట్లో ౨యెల్లు ఉంది చదివింది ఇంటరు.అప్పుడే ప్రజాసక్తినగర్ లో ఉన్న మా పెదనాన్న ,అంటే మా నంకి పెద్దమ్మ కుమారుడు మోటూరు హనుమంతరావు గారింటికి కూడా వెళ్లాను వాళ్ళ ఇంటినుండి గుణదల కొండ కనబడుతుండేది.ఒక రోజు అది ఎక్కాలని వెళ్ళా .సగం ఎక్కాక భయం వేసింది.అక్కడనుండి దిగి వచ్చా.
మోటూరు హనుమంతరావు గారిది వెల్లటూరు .ఆయన కమ్యునిస్ట్ నాయకుడు.1952 జనరల్ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుండి కమ్యునిస్ట్ అభ్యర్ధిగా మద్రాసు శాసనసభకు ఎన్నికైనారు.పెద్ద అమ్మయి తాన్యా నాతొ పాటు రేపల్లెలో ఫస్ట్ ఫారం చదివింది.తర్వాత వాళ్ళంతా బెజావాడలో సెటిల్ అవడంతో బెజావాడ వెళ్ళిపోయింది.
బెజావాడ కో కొండలు నది నాకు అబ్బురంగా నచ్చాయి .
నేను థర్డ్ ఫారం చదివేటప్పుడు,మా నాగేశ్వర రావు బాబాయ్ తో కలిసి విశాఖపట్నం వెళ్ళా.బ్రహ్మాండంగా నచ్చింది.
ఇక్కడా మా నాగేశ్వరరావు బాబాయ్ గురించి చెప్పాలి.మోటూరు హనుమంతరావు గారు మా నాన్నకి పెద్దమ్మ కుమారుదయితే ,నాగేశ్వరరావు బాబాయ్ మా నాన్నకి పిన్ని కుమారుడు.నాకు ఊహ తెలిసినప్పటినుండి,ఆయన తనతల్లి బాపమ్మ గారితో,మా ఇంట్లోనే ఉండేవాడు.ఆయన తండ్రి ,ఈయన తల్లి గర్భం లో ఉండగానే గాలివానకి గొర్రెలను తోలుకేల్లి చనిపోయడుట.నేను ఫాస్ట్ ఫారం లో ఉండగానే ఆయన బిఎస్సీ,బిఎడ్ పూర్తి జేసి మా రేపల్లె బోర్డ్ హై స్కూల్ లో టీచర్ గచేరాడు.లెక్కల మాస్టారు ఎస్సేల్సి అంటే స్కూల్ ఫైనల్ కి లెక్కలు ,బౌతిక శాస్త్రము చెప్పేవాడు.